Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జహీర్ ఖాన్ పై ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైన హార్దిక్ పాండ్య

  • జహీర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన హార్దిక్ పాండ్య
  • జహీర్ బంతికి తాను సిక్స్ కొట్టిన వీడియో ట్వీట్ చేసిన పాండ్య
  • నెటిజన్ల ట్రోలింగ్
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు ఆటలోనే కాదు మాటలోనూ దూకుడు ఎక్కువే! ఆమధ్య స్త్రీల గురించి ఓ టీవీ కార్యక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా, భారత క్రికెట్ దిగ్గజం జహీర్ ఖాన్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేశాడు. జహీర్ బౌలింగ్ లో తాను సిక్స్ కొట్టిన క్లిప్పింగ్ అది. అయితే, జహీర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ, "నేను ఎలా కొట్టానో నువ్వు కూడా అలాగే మైదానం బయటికి కొడతావని ఆశిస్తున్నా" అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

"నువ్వు టీవీ షోలో ఎలాంటి వ్యాఖ్యలు చేశావో  జహీర్ కూడా ఆ విధంగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నావా?" అని ఎత్తిపొడిచారు. "జహీర్ ఓ మైనారిటీ కాబట్టి ఈ విధంగా మాట్లాడగలిగావు, అదే ధోనీ, రోహిత్ లను ఈ విధంగా మాట్లాడే దమ్ము నీకుందా? వాళ్లు నిన్ను కొడితే పాత రోజుల్లోకి వెళ్లి పడతావు జాగ్రత్త!" అంటూ మరో నెటిజన్ హెచ్చరించాడు.

"బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లనే ఉతికారేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 53 సిక్సులు కొట్టాడు. తాను ఊపుమీదున్న రోజుల్లో అయితే ఓ ఇన్ స్వింగింగ్ యార్కర్ తో నీ కాలి బొటనవేలిని ఛిద్రం చేసేవాడు" అంటూ మరో క్రికెట్ అభిమాని మండిపడ్డాడు. "డబ్బు, పేరుప్రఖ్యాతులున్నంత మాత్రాన మంచి వ్యక్తి కాలేరు అనడానికి హార్దిక్ పాండ్యనే నిదర్శనం" అని మరో నెటిజన్ స్పందించాడు.
Zaheer Khan
Hardik Pandya
Cricket

More Telugu News